రెడ్డిపల్లిలో ప్రధాన రహదారి కోసం గ్రామస్తులు మహా ధర్నాలో తీవ్ర ఆందోళన
పద్మనాభం : వి న్యూస్ : డిసెంబర్ 31:
భీమిలి నియోజకవర్గం, పద్మనాభం మండలం, రెడ్డిపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి (S.H-138)పై కొన్నేళ్ల క్రితం రోడ్లను విస్తరించారు. కానీ నేటికీ 2 కి.మీ రోడ్లు వేయలేదు. దీంతో గ్రామ ప్రజలు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు వార్తా పత్రికల్లో వచ్చినా అధికారులు పరిష్కారం చూపలేకపోతున్నారు. దీనితో మంగళవారం గ్రామస్తులు ప్రధాన రహదారి పై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇది మాకు చాలాకాలంగా ఉన్న సమస్యగా మిగిలిపోయింది అని స్థానికులు వాపోతున్నారు.ఈ సమస్యను గత ప్రభుత్వంలో ఏ నాయకులు పట్టించుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఆశించామని కూటమి ప్రభుత్వ నేతలు కూడా గత ప్రభుత్వం వలె మొహం చాటేస్తున్నారని అన్నారు. ఈ రహదారిలో ప్రయానిస్తున్నవారు ప్రమాదాల బారిన పడుతుండటంతో కూటమి పెద్ద నేతల దృష్టికి వెళ్తే తప్ప సమస్య పరిష్కారం అయ్యేవిధంగా లేదని మంగళవారం నిరసనకు దిగామని అన్నారు. నేతలు ఇప్పటికి అయ్యినా మా సమస్యను గుర్తించి రహదారి వేసి పరిష్కరించాలని కోరుతున్నారు.