కారంపూడి మండలంలో నీరు లేని ఊరు ఉంది....కానీ మందు లేని పల్లె లేదు .....!?
కారంపూడి ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి రెస్టారెంట్ లకు, బెల్ట్ షాప్ లకు భారీగా మందు సరఫరా !?
బాటిల్ కు 10 రూపాయలు అదనంగా వసూళ్లు చేస్తున్న ఉద్యోగులు !!
పట్టించుకోని సంబంధిత అధికారులు !!
వి న్యూస్ , కారంపూడి :- ఏప్రిల్ 08:
అసలే వేసవికాలం...గ్రామాల్లో నీరు లేక దాహం దాహం అంటున్న పరిస్థితి. కారంపూడి మండలం లో నీరు లేని పల్లెలు ఉన్నాయేమో కానీ.. మందు (మద్యం) దొరకని ఊరు లేదు.జగన్ ప్రభుత్వ హయాంలో మండల కేంద్రమైన కారంపూడి లో రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి.వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసి సిబ్బంది కూడా ప్రభుత్వం నియమించిన వారే ఇక్కడ పని చేస్తున్నారు.ఈ మద్యం షాపుల్లో సరైన బ్రాండ్స్ లేక మద్యం ప్రియులు అల్లాడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మద్యం షాపులకు సరఫరా కాగానే ముందు బ్రాండ్ గల మద్యం బయటకు తరలిపోతోంది.ఒక దశలో చెప్పాలి అంతే ప్రభుత్వం మద్యం షాపులో దొరకని బ్రాండ్ లు బెల్ట్ షాపుల్లో, రెస్టారెంట్ లలో దర్శనమిస్తున్నాయి. ఒక్కో బాటిల్ కు అదనంగా 10 నుండి 20 రూపాయలు వసూలు చేసి మద్యం దుకాణంలో పని చేసే సిబ్బందే వాటిని బయటకు అమ్ముకుంటున్నట్లు కారంపూడి లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరో పక్క ప్రభుత్వ షాపుల్లో బ్రాండ్ గల మద్యం దొరక్క బయట బెల్ట్ షాపుల్లో, రెస్టారెంట్ లలో అదనంగా 50 రూపాయలు చెల్లించి కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని స్వయంగా మందు బాబులే చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా కారంపూడి మండలం లో పేరుకు రెండు షాపులు ఉన్నా గ్రామాల్లో మద్యం మాత్రం ఏరులై పారుతోంది. దీంతో నీరు లేని పల్లెలు ఉన్నాయేమో కానీ మద్యం దొరకని ఊరు లేదు కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి అధిక ధరలకు బెల్ట్ షాపులు. రెస్టారెంట్ లకు మద్యం సరఫరా చేస్తున్న ఉద్యోగుల పై చర్యలు తీసుకోవాలని మందు బాబులు కోరుతున్నారు.