మండుటెండలోను తరగని అభిమానం !గంటా ఎన్నికల ప్రచారానికి బ్రహ్మ రథం పట్టిన జనం
మధురవాడ, పెన్ షాట్ ప్రతినిధి : ఏప్రిల్ 27:
మండుటెండను సైతం లెక్క చేయకుండా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. శనివారం కొమ్మాది మూడు గుళ్లు, రిక్షా కాలనీ, హెచ్.బి.కాలనీ, దేవీ మెట్ట, సి కాలనీ, కొమ్మాది గ్రామం, అమరావతి కాలనీలలో ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా కుమారుడు రవితేజతో కలిసి ఈ ప్రాంతంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అపార్ట్ మెంట్లు, ముఖ్య కూడళ్ల దగ్గర చేరిన ప్రజలను కలుసుకుని స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొమ్మాది పరిసర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టిడిపి హయాంలో 2014 - 2019 మధ్య ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గంలో రూ. 3,800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ అయిదేళ్లలో అభివృద్ధి అనే మాటను సైతం రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని చెప్పారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా నడిపించే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని, ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గ్యారెంటీ అని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి కాలనీలోను గంటాకు స్వాగతం చెబుతూ మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. భారీగా బాణసంచా కాల్చారు. గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ, టిడిపి ఇంచార్జీ కోరాడ రాజబాబు, బీజేపీ ఇంచార్జీ రామానాయుడు, జనసేన నాయకులు పాల్గొన్నారు.