ప్రజల ఆరోగ్యమే పరమావధిగా సేవలు అందించండి

ప్రజల ఆరోగ్యమే పరమావధిగా సేవలు అందించండి

-ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షించే మహోన్నతులు నర్స్ లు

- డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కె. బాబ్జి

విశాఖపట్నం (సెప్టెంబర్ 23):

ఎల్లవేళలా ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుని కాంక్షిస్తూ నిస్వార్ధంగా సేవలు అందించే వ్యక్తుల్లో నర్స్ ఎంతో కీలకమని డాక్టర్ వైయస్సార్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ కె. బాబ్జి అన్నారు. శనివారం సిరిపురంలోని విఎంఆర్డిఏ చిల్డ్రన్ అరేనలో నిర్వహించిన సెయింట్ లూక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్,  విజయ లూక్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గ్రాడ్యుయేషన్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. బాబ్జి  నర్సింగ్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 

ప్రజల ఆరోగ్య సంరక్షణ పరమావధిగా విస్తృత సేవలు అందించాలని పిలుపునిచ్చారు. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఎదుట వ్యక్తి ప్రాణాలను కాపాడడానికి పోరాడే సోదరిగా నర్సులు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారని అన్నారు. వైద్య సహాయం అవసరమైనప్పుడు మనకు సపర్యలు చేస్తూ త్వరగా ఆరోగ్యం మెరుగు కావడానికి అవసరమైన మానసిక ధైర్యాన్ని అందించే వృత్తుల్లో ఇది ఒకటిగా నిలుస్తోందని చెప్పారు. మైత్రి భావన కలిగి ఉండడం ఎంతో అవసరమని చెప్పారు. సాటి మనిషి పట్ల ప్రేమ, జాలి, కరుణ కలిగి ఉంటూ సహనంతో నడుచుకుంటూ మన ఎదురుగా దర్శనమిచ్చే దేవుడుగా నర్సులు నిలుస్తారనడంలో సందేహం లేదన్నారు. కోవిడ్ వంటి విపత్కర సమయాలలో కూడా వీరు తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఇతరుల ప్రాణాలను రక్షించడానికి అందించిన సేవలు సమాజం ఎన్నటికీ మరువదని అన్నారు. అనారోగ్యంతో వచ్చిన రోగికి చిరునవ్వుతో సమాధానమిస్తూ వారిలో మనో ధైర్యాన్ని నింపే గొప్ప సైకాలజిస్ట్ గా వీరు నిలుస్తున్నారని అన్నారు. సమాజంలో ఎంతో గౌరవం గుర్తింపు కలిగిన ఈ వృత్తిలో అడుగుడుతున్న నర్సింగ్ విద్యార్థులు తమ వృత్తికి మరింత గుర్తింపు, గౌరవాన్ని తీసుకువచ్చే విధంగా నడుచుకోవాలని సూచించారు.

ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. బుచ్చిరాజు మాట్లాడుతూ వైద్య రంగంలో వైద్యులతో సమానంగా రోగికి అవసరమైన సేవలు అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి నర్సులు అందిస్తున్న సేవలు నిరూపమానమని అన్నారు. కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ పి.అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో నర్సింగ్ విద్యను పూర్తి చేసిన వారికి విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వీటిని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా రాణించాలని సూచించారు. వృత్తిపరమైన ధర్మాలను, నైతిక విలువలను పరిరక్షించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. కేజీహెచ్ పూర్వ సూపరిండెంట్ డాక్టర్ జి. అర్జున మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే నర్సింగ్ ఉద్యోగులు నిత్యం ఎంతో ఒత్తిడిలో సైతం సమర్థవంతమైన సేవలను అందించడం జరుగుతుందని చెప్పారు. ఏపీ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్ ఏఎన్ఎం అండ్ హెల్త్ విజిటర్స్ కౌన్సిల్ రిజిస్టర్ ఆచార్య కె. సుశీల మాట్లాడుతూ భారతీయ నర్సింగ్ విద్యను పూర్తి చేసిన వారికి విదేశాల సైతం  ఉపాధి అవకాశాలు లభిస్తున్న విధానాలని వివరించారు. కార్యక్రమంలో కేజీహెచ్ డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వాణి,సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి ఎం.విజయ లూక్, కరస్పాండెంట్ మమత ప్రసాద్, డైరెక్టర్ షాబిలా ప్రీతం, డైరెక్టర్ షైనీ సుమన్, డైరెక్టర్ ప్రీతమ్ లూక్ తదితరులు ప్రసంగించారు.