సముద్ర తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఆపండి..!టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు డిమాండ్

సముద్ర తీర ప్రాంతంలో  ఇసుక తవ్వకాలు ఆపండి..!టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు డిమాండ్

తీర ప్రాంత విద్వoశానికే  రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందా..? అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

భీమిలి: వి న్యూస్ : సెప్టెంబర్ 25: 


          తీర ప్రాంతంలో బీచ్ శాండ్ మైనింగ్ చేయాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై గంటా నూకరాజు స్పందించారు.  బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు అర్జన వస్తుందన్న ఆలోచన తప్పా,  శాండ్ మైనింగ్ చేస్తే పర్యావరణానికి ఎంత ముప్పు వాటిల్లితుందనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని  అన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలను కేంద్రం నిలిపివేసిందని గుర్తు చేసారు.  పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని నిపుణులు ఇచ్చిన సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.  పర్యావరణ రక్షణపట్ల కేంద్రానికేనా.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా అని ప్రశ్నించారు.  తీరంలో ఉండే ఎత్తయిన ఇసుక దిబ్బలను,  ఇసుక తవ్వకాలు చేసినట్లుయితే భవిష్యత్తులో  బీచ్ పూర్తిగా లేదా పాక్షికంగా అదృశ్యం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు.  బహుశా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఇదేనేమో అని వ్యంగ్యంగా అన్నారు.  తీర ప్రాంతంలో మత్స్యకారులు నివాసం ఉంటారని,  బీచ్ మైనింగ్ చేయడం వలన సముద్రం ముందుకు సొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని అన్నారు.  దీని కారణంగా వారి వృత్తికి, ఆస్తుల సంరక్షణకు, జీవన విధానానికి తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు.  అంతే కాకుండా పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుందని అన్నారు.  దీనిని దృష్టిలో పెట్టుకొనే  తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు.  అటు కేంద్రం చెప్పినా వినరు, ఇటు పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించినా పట్టించుకోరు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అని అన్నారు. ఈ ప్రభుత్వానికి డబ్బులతోనే పని తప్ప పర్యావరణం పట్ల, ప్రజల జీవన విధానంతో గాని సంబంధం ఉండదా..? అని ప్రశ్నించారు.  ఇప్పటికే విశాఖ ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్ కోతకు గురవుతుందని,  రోజురోజుకి సముద్రం ముందుకు సొచ్చుకు వస్తుందని అన్నారు.  ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో  పరిష్కార మార్గాలు చూడవలసిన ప్రభుత్వం ఇంకా సమస్యను రెట్టింపు చేసేవిధంగా ఆలోచన చేయడం దురదృష్టకరమని అన్నారు.  మొండివైఖరిని విడనాడి నిపుణుల సలహాలు సూచనలు మేరకు ప్రభుత్వం అడుగులు వేయాలని గంటా నూకరాజు సూచించారు.