జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)ని పార్లమెంట్‌ పరిశీలనకు పంపాలి.

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)ని పార్లమెంట్‌ పరిశీలనకు పంపాలి. 

వి న్యూస్: మే 1

విద్యను సరుకుగా మార్చే సాధనంగా నూతన విధానం.

ప్రత్యామ్నాయ ప్రజానుకూల విద్యా విధానానికి రాష్ట్రాలు మద్దతివ్వాలి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)కి ప్రత్యామ్నాయ ప్రజానుకూల విద్యా విధానం కోసం ఉద్యమించాల్సిన అవసరమున్నదని ప్రజా సైన్స్ ఉద్యమ నేత వి.కృష్ణ మోహన్ పేర్కొన్నారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ విద్య, ఆధునిక, సాంస్కృతికంగా విభిన్నమైన, సమానమైన, స్వావలంబన కలిగిన ఆర్థిక వ్యవస్థను, సమాజంలో ప్రజల సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుందని ఉద్ఘాటించారు. ఎన్‌ఈపీ పేద, దళిత, గిరిజన, మైనార్టీ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు విద్యను దూరం చేస్తోందని, దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 'సేవ్‌ ఎడ్యుకేషన్‌, సేవ్‌ నేషన్‌' నినాదంతో ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ (ఏఐపీఎస్‌ఎన్‌), భారత్‌ జ్ఞాన్‌ విజ్ఞాన సమితి (బీజీవీఎస్‌)లు సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాలకు  పలు సంఘాలతో పాటు మద్దతు తెలిపారు. ఈ సమావేశం ఎన్‌ఈపీ, దాని అవాంఛనీయ లక్షణాలను తిప్పికొట్టడానికి, ప్రగతిశీల, ప్రజా అనుకూల ప్రభుత్వ విద్యా వ్యవస్థ కోసం పని చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, మద్దతును కోరిందని తెలిపారు.

విద్యను వర్గీకరించడానికి, సరుకుగా మార్చడానికి ఒక వాహనంగా ఎన్‌ఈపీ పని చేస్తుందని  వి.కృష్ణ మోహన్ విమర్శించారు. దేశ ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విద్యా విధానం ఉండాలని అన్నారు. దేశంలోని సమాఖ్య సూత్రాలను నిరాకరిస్తూ కేంద్రీకరణను విధించాలని ఎన్‌ఈపీ స్పష్టం చేస్తున్నదన్నారు. ఎన్‌ఈపీని పార్లమెంటరీ పరిశీలన చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక విద్యా విధానం గత విధానం డాక్యుమెంట్‌ల ప్రభావాలు, మెరిట్‌లు, లోపాలను పరిశీలించాలి. కానీ ఎన్‌ఈపీ గత విధానం డాక్యుమెంట్ల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదని తెలిపారు. 

కార్పొరేట్‌ శక్తులతో, మతోన్మాద శక్తులు చేతులు కలుపుతున్న ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్‌ఈపీని చూడాలని కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్. బిందు అన్నారని, రాష్ట్రం, దాని ప్రజల నిర్దిష్ట అవసరాలకు సరిపోయే ఉన్నత విద్యా నమూనాతో ఎన్‌ఈపీని నిరోధిస్తున్నామని చెప్పారని తెలిపారు. యుజిసి మాజీ చైర్మన్‌, ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌  కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తోందని, సమానత్వం, అందరికీ విద్యపై నూతన విద్యా వ్యవస్థలో ఎటువంటి ప్రతిపాదనలు లేవని అన్నారని పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్శిటీ మాజీ డీన్‌, ప్రొఫెసర్‌ అనిత రాంపాల్‌  విద్యార్థులకు విద్యను దూరం చేసే విధానమే ఎన్‌ఈపి అని పేర్కొన్నారని, ఎన్‌యుఈపిఎ మాజీ వైస్‌ చాన్సలర్‌ ఎన్‌వి వర్గేశ్‌  ఉన్నత విద్యా వ్యవస్థను మార్కెట్‌గా, విద్యను సరుకుగా ఎన్‌ఈపీ చూస్తోందని, కార్పొరేట్లకు అనుసంధానం చేసే వ్యవస్థను ఇప్పుడు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారని తెలిపారు.   ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్‌ఎన్‌ నాయకులు సత్యజిత్‌ రాత్‌, ఆశా మిశ్రా,ఎస్‌ఆర్‌ ఆజాద్‌, శాస్త్రవేత్త డి. రఘునందన్‌, బీజీవీఎస్‌ ప్రధాన కార్యదర్శి కాశ్‌నాథ్‌ ఛటర్జీ, జేఎన్‌యూటీఏ అవినాష్‌ మిశ్రా, జేఎఫ్‌ఎంఈ చైర్‌ పర్సన్‌ నందితా నారాయన్‌ తదితరులు మాట్లాడారని, వివిధ సాంస్కృతిక బృందాలు నృత్య ప్రదర్శనలు చేయగా, మరికొన్ని బృందాలు గీతాలాపన చేశాయని, నూతన విద్యా విధానంపై షార్ట్‌ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలను ప్రదర్శించారని  వి. కృష్ణ మోహన్ తెలిపారు.