గెలవాలి అంటే తెలుగుదేశం,బిజెపి,జనసేనలు కలవాలి..!

గెలవాలి అంటే తెలుగుదేశం,బిజెపి,జనసేనలు కలవాలి..! 

విశాఖపట్నం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రధానంగా ప్రస్తుత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గతంలో అంటే.., 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉండగా చేసిన తప్పులు నేటికీ వెంటాడుతున్నాయి.అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులనే ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కూడా చేస్తున్నప్పటికీ ప్రజలకు సరైన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ లేని పరిస్థితి ఎదురయింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ వైసిపి ప్రభుత్వం మూడేళ్ళ పరిపాలన పూర్తి చేసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. 

రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు  అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు.., 

ప్రతి విమర్శలు.., ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ ముష్టి యుద్ధాలకు కూడా దిగుతున్నాయి.మరోవైపు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు పొత్తులకు కసరత్తు చేస్తున్నాయి.అధికార వైసీపీ మాత్రం ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని..,ఒంటరి గానే ఎన్నికల బరిలోకి దిగుతామని ఇప్పటికే ప్రకటించింది.ఇకపోతే తెలుగుదేశం, బిజెపి,జనసేనలు కలిసి సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేస్తే రాష్ట్రంలో అధికార వైసీపీని ఎదుర్కోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు 

అందుకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే ఈ మూడు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందా? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ 

జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వానికి అనుకూలంగా 

ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు కనబడుతున్నాయి.అదే నిజమైతే తెలుగుదేశం జనసేనలతో కలిసి బిజెపి పోటీ చేయడం సాధ్యపడనట్లే.

ఇక మిగిలిన తెలుగుదేశం, జనసేన పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకుని ఎన్నికల బరిలోకి దిగితే అధికార వైకాపాను ధీటుగా ఎదుర్కోలేవన్నది మరో అంచనా. రాష్ట్రంలో ఎంత లేదనుకున్నా భారతీయ జనతా పార్టీకి ప్రతి నియోజకవర్గంలో 

స్వతహాగా తమకంటూ ఐదు నుంచి 10 వేల వరకు..,కొన్ని నియోజకవర్గాల్లో అంతకంటే ఎక్కువగానే ఓట్లు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బిజెపి ఓటు బ్యాంకు ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించ లేకపోయినా అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికార వైకాపాకు భాజపా పరోక్షంగా సహకరిస్తున్నదని ప్రజలు, 

రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే మైత్రిని  రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కొనసాగించినట్లయితే వైకాపాతో కలిసి పోటీ చేయకున్నా.., బిజెపి ఒంటరిగా పోటీ చేసినా తెలుగుదేశం జనసేన పార్టీలు నష్టపోయే ప్రమాదముంది.ప్రస్తుతం అధికార వైకాపా అదే ధీమాతో ముందుకు సాగుతోంది.వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తే తప్ప తెలుగుదేశం జనసేన పార్టీలు ఏ మాత్రం లాభ పడే పరిస్థితులు ప్రస్తుతానికి కనబడడం లేదు. అయితే టీడీపీ జనసేనలతో బిజెపి జతకడితే మాత్రం అధికార వైకాపా నష్టపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అధికార వైకాపాను టిడిపి జనసేనలు  ఎండగడుతున్నట్టుగా బీజేపీ గొంతు కలపడం లేదు. 

దీని దృష్ట్యా ప్రస్తుతానికి అయితే 

ఈ మూడు పార్టీలు రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకొని పోటీ చేసే పరిస్థితి మాత్రం కానరావడం లేదు.పరిస్థితి ఎన్నికల వరకు ఇలాగే ఉంటే మాత్రం అధికార వైకాపాను ఎదుర్కోవడం టీడీపీ,జనసేనలకు కష్టతరమే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న ఎన్నికల్లో

గెలవాలంటే ఈ మూడు పార్టీలు కలిసే ప్రయత్నాలు మొదలు పెట్టాలని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. 

లేదంటే సీఎం పీఠాన్ని వైకాపాకు మళ్ళీ బంగారం పళ్లెంలో పెట్టి అప్పగించినట్లవుతుందని చెబుతున్నారు.