టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ :
పద్మనాభం:
పద్మనాభం : మండలం లోని పాండ్రంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కంటుబోతు సుమంత్ నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోరాడ వైకుంఠ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెంక సురేష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రతీ ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ ప్రాంతం ఎందరికో స్ఫూర్తిదాయకమని, వ్యక్తి కన్నా దేశం ముఖ్యం అని చాటాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వైకుంఠ రావు మాట్లాడుతూ ఆనాటి స్వతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ వారి విలువలతో కూడిన నడవడికను యువతరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలను నిర్వహించి, గెలుపొందిన వారికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యం.శ్రీనివాస్ రావు , టి.ఎన్.ఎస్.ఎఫ్ కార్యదర్శి బసన అప్పలరాజు, సారధి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.